Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష-1

ప్రముఖ హేతువాది శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి రచన 'వాస్తువు శాస్త్రమా ?' పై 2001 లో నేను రాసిన ఈ సమీక్ష నాచే రచింపబడిన 'వాస్తులో ఏముంది?' మరియు 'వాస్తులో వాస్తవాలు' అనే పుస్తకాలపై వారు చేసిన విమర్శకు వివరణ ఇవ్వటమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సరైన కోణంలో అవగాహన చేసుకోవటానికి, ఉపకరిస్తుంది భావిస్తున్నాను.

తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని అన్నట్లే హేతువాదం పేరుతో గ్రంథ రచయిత చెప్పినవన్నీ వాస్తవాలు కావు. హేతువాది పత్రికలో 'వాస్తులో వాస్తవమెంత?' అనే శీర్షిక పేరుతో ప్రఫుల్ల చంద్ర గారు రాసిన వ్యాసాలను భూమికగా చేసుకొని వాస్తుపై పెద్ద పుస్తకం రాయాలనే కుతితో ఈ పుస్తకాన్ని రాసినట్లు రావిపూడి గారు ముందుమాటలో చెప్పుకున్నారు. అలాగే పుస్తకానికి 'వాస్తులో వాస్తవమెంత?' అనే పేరు పెడితే వాస్తులో 'వాస్తవం' ఎంతో కొంత ఉంటుందేమోనని శంకతో దీనికి వాస్తువు శాస్త్రమా? అనే పేరు పెట్టారట. ఆహా ఏమి హేతువాదం? ఒక విషయం పై ముందే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన వాదం నెగ్గటానికి వితండవాదం చేయటం వారికే చెల్లు. వాస్తు అనేది శాస్త్రం కాదు, కాదు, కానేకాదు అనే ఒక ముక్క నొక్కి గట్టిగా చెప్పటానికి 152 పేజీలు మాత్రమే ఖరాబు చేశారట. దీనిపై ఇంకా విస్తృత్తంగా రాయవచ్చు కానీ అనవసరపు కాగితం ఖర్చుఅని ఇంతటితో ముగింపు ఇచ్చారట. వాస్తు అనేది శాస్త్రం కాదు అనే ముక్క చెప్పటానికి ఒక చిన్న కరపత్రం సరిపోయేదానికి వీరికి పుస్తకం రాయాలన్నా కోరికెందుకో! బహు గ్రంథ కర్తగా ఉండాలనే తపనతో ఏ విషయం పైనైనా ఎడా పెడా సంక్షిప్త రచన కొనసాగించ వచ్చు. కానీ తనకు పరిచయం లేని నిర్మాణ, సాంకేతిక విషయాలపై హేతువాదం పేరుతో అవాక్కులు చెవాకులు చెప్పటం రావిపూడి గారి ఈ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది.


వాస్తువు శాస్త్రమా, కాదా అనే విషయంలో ఈనాడు విభిన్న వాదనలున్నాయి. నిజానికి వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా పరి రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే మన ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. క్రోడీకరించిన సూత్రాలను తూచా తప్పక ఆచరించటమే ఆనాటి శాస్త్ర లక్షణం. అయితే నేడు శాస్త్రం అనే పదాన్ని విజ్ఞాన శాస్త్రం (సైన్సు) కు పర్యాపదంగా వాడుతున్నారు.

వాస్తువు శాస్త్రమా? అనే విషయంలో పెళ్ళికి,పిడుగుకు ఒకటే మంత్రం అన్న చందనా రావిపూడి వారి రాతలు ఉన్నాయి. ఆనాటి వాస్తుకి నేటి సైన్సు పరిధిలో ఎంత విలువ ఉంది ? సైన్సుకు వున్నా లక్షణాలు దీనికి వున్నాయా ? అనే విషయంలో పూర్వాపరాలు పరిశీలించాలి. ఒక నాడు వాస్తు విద్యగా, వాస్తు శిల్ప కళగా పిలవబడి వాస్తు శాస్త్రంగా స్థిరపడి చలనం కోల్పోయిన తీరును తెలుసుకోవాలి. వాస్తులో చెప్పబడిన అంశాలను సాంకేతిక విషయాలుగా, సామాజిక విషయాలుగా, సాధారణ విషయాలుగా వేరుచేసి వాటిలోని తప్పుఒప్పులు పరిశీలించుకోవాలి. వాస్తులో చెప్పబడిన మంచి,చెడు ఫలితాలలో ఆశలు, భయాలు జోడించింది కేవలం వాస్తు సూత్రాలు ప్రజలు తుచ తప్పకుండా ఆచరించటానికి మాత్రమే. ఆనాటి సమాజంలో సామూహికంగా అమలు జేయటానికి చేప్పబడిన వీటిని చూసి భయాందోళనలు చెందనవసరం లేదని నా రచనలలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. పూర్తి ఆధారసహితంగా పరిశోధించి, సాంకేతికంగా పరిశీలించి రాసిన నా రచనలపై వారి విమర్శలో శాస్త్రీయత కానీ సహేతుకత కానీ కన్పించదు.
రావిపూడి గారి ఆలోచనలన్నీ కేవలం ఫలిత వాస్తు చుట్టూ పరిభ్రమిస్తూ వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మూలాన్ని వదిలి తుది తీర్పు చెప్పారు. అర్ధ సత్యాలను మూఢంగా నమ్మేవారు హేతువాదులు ఎలా అవుతారు ?

ఇంజనీరింగ్ - వాస్తువు

వాస్తులో ఏముంది? అనే గ్రంధంలో నేను ఇంజినీరింగు తో వాస్తుకు లంకె పెట్టటం తాత మోకాటికి - అవ్వ బోడితలకి ముడివేసినట్లున్నదని రావిపూడి గారు వాపోయారు, పరిణామక్రమంలో ఆదిమ మానవుడు గుహల నుండి గృహాలలోకి మారిన విషయంలో గుప్తజ్ఞానం ఏమీ లేదుకదా. సంచార జీవనం నుండి స్థిర నివాసాలు ఏర్పరుచుకునే క్రమంలో గ్రామ, నగర, పట్టణాలుగా జనావాసాలు ఏర్పరటం, బాటలు, పేటలు, కోటలు, ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు వచ్చాయి. క్రమ బద్దమైన జనావాసాల కొరకు రూపొందించుకున్న నిర్మాణ శాస్త్రమే ఈ వాస్తు శాస్త్రం అని ఒప్పుకోవటానికి వీరికి వచ్చిన అడ్డంకి ఏమిటో తెలియదు. కానీ మరొక చోట " మన దేశంలోని నిర్మాణ శాస్త్రంలో వాస్తువు పేరుతో మార్మికత చొరబడింది " అని అంటూ అష్టదిక్పాలకులు. వాస్తు పురుషుడు, గ్రహ నక్షత్రాలు, దిశాఫలాలు వాస్తువు పేరుతో చొరబడటం వల్ల నిర్మాణ శాస్త్రం ఎటు పోయిందో అంటూ సన్నాయి రాగం అందుకున్నారు. ప్రామాణిక వాస్తు మూల గ్రంధాలను వదిలి మూస గ్రంధాలను మాత్రమే చదివితే వచ్చే తంటా ఇదే. ఇలా గంద్రగోళపడే వారిని దృష్టిలో ఉంచుకొనే జ్యోతిష్య సంబంధ అంశాలను తొలగించి శుద్ధ గృహ నిర్మాణ విషయాలను మాత్రమే ఆ పుస్తకంలో చర్చించాను. జ్యోతిష్యం గురించి నా అభిప్రాయాలు ఇక్కడ అప్రస్తుతం అని చెప్పలేదు. జ్యోతిష్యం శాస్త్రమని చెప్పలేదు కాబట్టి వాస్తువు శాస్త్రం ఎలా అవుతుందని వీరి ప్రశ్న.
వాస్తును జ్యోతిష్యం కళ్ల జోడుతో చూసే వారికి వాస్తులో జ్యోతిష్యం మాత్రమే కనిపిస్తుందిగాని నిర్మాణ శాస్త్రం కనబడదు.
దేవుడు, మతం రెండు మూఢ విశ్వాసాలు అని నేను అంగీకరించలేదని ఏక పక్షముగా భావిస్తూ అందువల్ల వాస్తువును నిర్మాణశాస్త్రంతో ముడి వేయటానికి వారధి నిర్మించటానికి ప్రయత్నించానట. ఇది అతకని టంకం అని రావిపూడి గారి హేతుబద్ధ వాదన. వీరి వాదన ఇంకా ఇలా కొసాగించారు
నిర్మాణ శాస్త్రానికి వాస్తువు కు ముడి వేశారు- ఇది తప్పు
జ్యోతిష్యానికి వాస్తుకు ముడివేశారు- ఇది తప్పు
జ్యోతిష్యం శాస్త్రం కాదు కాబట్టి వాస్తువు శాస్త్రం కాదని సిద్ధాంతీకరించారు.
నిర్మాణ శాస్త్రం వాస్తువు వేరు వేరనే వీరి నిశ్ఛత అభిప్రాయం. వీరు ఇలా భ్రమ పడటానికి కేవలం వీరి జ్ఞానం చౌక బారు మూస వాస్తు పుస్తకాలకే పరిమితం అవటమే. ఆ జ్ఞానంతో వాస్తుకి జ్యోతిష్యానికి టంకం పెట్టి ముడి వేశారు కానీ అది అతకలేదు (సశేషం)
ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...