జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్యస్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో మరొక జల జాతర మొదలౌతుంది.
గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) పాటించేవారికి అది ఒక మాసం. 12 మాసాలు కు 12 ఏళ్ళు పట్టి ఒక కొత్త సంవత్సరం మెదలు అవుతుంది. దీనిని బట్టి మనకు 12 సంవత్సరాలు కాలం దేవతలకు ఒక దినం అనే ఒక దేవతా కాలమానం పుట్టించారు. 
దాని ప్రకారం బృహస్పతి గ్రహం సింహ రాశి లో ఉంటే గోదావరికి , కన్య రాశి లో ఉంటే కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా 12 రాశులకు 12 నదులకు పుష్కరాలు ఏర్పరిచారు. దేశంలో ఇంకా చాలా నదులు, పురాణాల ప్రకారం మూడున్నర కోట్ల పుణ్య తీర్థాలు ఉన్నా కేవలం పురోహిత ప్రాభల్యం ఉన్న నదీతీర పట్టణాలను బట్టి, ప్రవాహం ఉండే గురుమాసంను బట్టి ఈ 12 జీవ నదులను ఎంపిక చేశారు. నదుల నైసర్గిక స్వరూప స్వభావాలు తెలియని కుక్షింభరులు ప్రాంతాల కూర్పుతో ఏర్పరిచిన ఈ పుష్కరాల పండుగలో ఉపనదులకు కూడా చోటు దక్కింది. తుంగ,భద్ర, భీమా నదులు కృష్ణా నదిలో ప్రాణహిత నది గోదావరిలో సంగమిస్తుందన్న జ్ఞానం లేని పండితులు గురు గ్రహం వృచ్ఛకంలో ఉంటే భీమా నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రకు, మీనరాశిలోఉంటే ప్రాణహితకు పుష్కరాలు వస్తాయని చెప్పారు. దీని ప్రకారం 2018 లో భీమానది వల్ల, 2020 లో తుంగభద్ర వల్ల కూడా కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే 2022లో ప్రాణహిత వల్ల మరోసారి గోదావరికి పుష్కరాలు పునరావుతమౌతాయి కదా! అలాగే గోదావరి పట్టిసీమ ద్వారా కృష్ణాలో కలుస్తుంది కాబట్టి గోదావరికి సంబంధం ఉన్న పుష్కరాలు కృష్ణకు వర్తిస్తాయి. అంటే పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయనేది వాస్తవం కాదు. అలాగే ఏ నదులకు పుష్కరయోగం ఉందొ, దేనికి లేదో అనే విషయంలో కూడా జ్యోతిష్య పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 
పుష్కర వ్యాపారం పరాకాష్టకు చేరి పిండం పెట్టె పురోహితుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు విజయవాడ వద్ద కృష్ణాలో కలుస్తాయి కాబట్టి విజయవాడ లో జరిగే పుష్కర స్నానంలో పుణ్యం రాదని విజయవాడ ఎగువన తెలంగాణలో చేస్తేనే పుణ్యం వస్తుందనేది అక్కడి పండితుల వాదన అయితే ఇది దక్షిణలు దండుకునేందుకు పొట్టకూటి పురోహితుల పన్నాగం అని ఇక్కడ వారి ఉవాచ. 
నదుల అనుసంధానం వల్ల ప్రతి ఏడాది పుష్కరం వచ్చే చిక్కు ఉంది కాబట్టి అనుసంధానమే అపవిత్రమనే కుక్షింభరులను ఉపేక్షించితే దేశానికి నీటి ఎద్దడి, ఆహార కొరత వచ్చే ప్రమాదముంది. గోదావరి, కృష్ణ నదులతో పాటు వాటి ఉప నదులకు కూడా పుష్కరాలు ఉన్నాయన్న సంగతి ఈ బాపతు పొట్టకూటి వాదనలు చేసేవాళ్ళు గుర్తుంచుకుంటే మంచిది. 
మతపరమైన ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక పద్దతి ప్రకారం పుష్కరాల పేరుతో అన్ని ప్రాంతాల ప్రజలను పిండుకొనే వైనం గోచరిస్తుంది. అమాయాక ప్రజలను మభ్యపెట్టటానికి పుష్కరాలను గురించి ఒక కాకమ్మ కధ చెబుతారు. 
పూర్వం తుందిలుడనే బ్రాహ్మణుడు ఈశ్వరుని గురించి తపమాచరించి తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం ఉండేలా వరాన్ని పొందాడట. జలమూర్తి రూపంలో అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే జల శక్తి (సంస్కృతంలో పుష్కరం అంటే తామర కొలను, సరస్సు అనే అర్థాలతోపాటు, పోషించే శక్తిని కూడా పుష్కరం అని అంటారు) లభించటం వల్ల తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వమనగా, ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత (?) ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాగా ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మని వదలి వెళ్ళలేనని తెగేసి చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక త్రిసభ్య ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో కలిసి ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ కధనంలో కనిపించే పరస్పర వైరుధ్యాలు, విచిత్రకల్పన వల్ల కధలో ఉన్న డొల్లతనం ప్రస్ఫుటం అవుతున్నది. 
పుష్కర స్నానం వల్ల పుణ్యం, పుష్కర దానం, పుష్కర పిండం వంటి వాటివల్ల చనిపోయిన పితృ దేవతలకు పుణ్యలోకం ప్రాప్తిస్తుందనే విశ్వాసం మాటున సామూహిక దోపిడీ దాగుందన్నది దాచలేని నిజం. 
పుష్కర స్నానం పుణ్య ప్రదం అనే పురాణాల ప్రవచనాలు నమ్మి పిల్ల జెల్లా లతోపాటు స్త్రీ పురుషులు అందరు పుష్కరాలకు పరుగులు తీస్తారు. నదీ స్నానం వల్ల పుణ్యం మాట దేవుడెరుగు, అపరిశుభ్ర నీటి వల్ల జల సంబంధ జబ్బులు రావటం ఖాయం. 
అలాగే మరణించిన పితురులకు ప్రతి ఏడాది సంవత్సరీకం చేసే ఆచారం జంధ్యం వేసుకొనే కొన్ని కులాలలో (ద్విజులు) కొందరికి మాత్రమే ఉంది. పుష్కరాల ఆసరాతో 'పిండ ప్రధానం' ఆచారాన్ని అందరికి వర్తింప చేసారు. పిండ ప్రధానం పేరుతో పెట్టే పిడికెడు పిండి, గుక్కెడు నీళ్ళు కాలం చెందిన పితృ దేవతల ఆకలి తీరుస్తుదనేది వట్టి బూటకమాట. పున్నామనరకం నుండి బయటపడేందుకు చేసే పుష్కర దానాలు చేరేది పురోహితుల ఇళ్లకే కానీ పుణ్యలోకాలకు కాదు. బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు సరిగ్గా తిండి పెట్టని ప్రభుద్దులు మరణించిన వారికి దినాలు, తద్దినాలు పేరుతో పిండాలు పెట్టటం, దానాలు చేయటం అనుచితం, అవాంఛనీయం. 
రోజువారీ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేలా పుష్కర స్నానాల పేరుతో ఒక బృహత్తర పజాపయోగ్య పనిగా నేటి పాలకులు పుష్కర నిర్వహణను నెత్తిన పెట్టుకున్నారు. సాముకంగా జనులను మూఢ విశ్వాసాలలో ముంచే ఇలాంటి పనికి ప్రపంచవ్యాప్త ప్రచారం చేయటం ఆక్షేపణీయం. పుష్కారాలకు వచ్చే యాత్రికుల బాగోగులు చూడాలన్న మిషతో తాత్కాలిక ఏర్పాట్లకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టె కోట్లాది రూపాయలు లెక్కా డొక్కా ఉండదు. ప్రజా ధనాన్ని ఇలా నీటి పాలు చేయటం సరికాదు. 
ప్రజలలో శాస్త్రీయ భావనలు పెంచి వారిని వివేకవంతులగా చేయటానికి బదులు ఆదిమ కాలం నాటి మత విశ్వాసాలను పెంచి పోషించటం దేశానికి, సమాజానికి ఎంతమాత్రం శ్రేయోదాయకం కాదు. 
ఆచార్య కొడాలి శ్రీనివాస్ 

వ్యాఖ్యలు

అజ్ఞాత చెప్పారు…
Dear Mr Srinivas,

After a long time I am writing to you again. I came across your Blog on the mythological, historical and socio-political background of the tradition of "pushkaralu". You have taken up a difficult subject, but you presented your arguments quite boldly. I commend you for that. I was aware of the 12 year cycles in many an Indian tradition, but it was very interesting to note the significance associated with ancient astronomy. Rivers, tributaries and confluences practically in all continents have been having a major impact on the economies of various countries, but in the Indian context there is also the aspect of mysticism that is attached to nearly all rivers.
I had come to Guntur a few times during the last two years after I spoke to you once. But I was help up by other domestic responsibilities. Maybe the next time I should try to meet you.

With best regards
George Nathaniel