22, ఆగస్టు 2017, మంగళవారం

జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలే !


మనువు దృష్టిలో
జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలే !
స్మృతికారుడు మనువు దృష్టిలో జ్యోతిషము, హస్తసాముద్రికము పచ్చి మోసాలనే విషయం మీద ఆధార సహితంగా శ్రీ ముతేవి రవీంద్రనాథ్ గారు  రాసిన ఈ వ్యాసం  పేస్ బుక్ లో చూడనివారికోసం తిరిగి ఇలా ..
జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలు. ఈ మాట ఎవరో శాస్త్రీయ దృష్టి కలిగిన ఆధునికుడు అన్నది కాదు. వందల ఏళ్ళ క్రిందటే ప్రసిద్ధ భారతీయ స్మృతి కారుడు మనువు పేర్కొన్నది. తాను రాసిన ‘మను ధర్మ శాస్త్రం' ద్వారా వర్ణాశ్రమ ధర్మాలను వ్యవస్థీకృతం చేసి, సామాజికంగా కర్కశమైన కుల నియమాలను, కఠినమైన కట్టుబాట్లను ఏర్పరచి సమాజాన్ని నిమ్నోన్నత సామాజిక వర్గాలుగా ముక్క చెక్కలు చేశాడన్న దుష్కీర్తిని మూటగట్టుకున్న మనువు తాను రూపొందించిన ‘మనుస్మృతి' లోని నవమాధ్యాయంలోని 258 వ శ్లోకంలో ఏమన్నాడో చూడండి -
( నేపథ్యం : రాజు తన రాజ్యంలోని ప్రజల సంక్షేమం దృష్ట్యా ఎవరెవరి పట్ల జాగరూకత కలిగి ఉండాలో చెపుతాడు మనువు. రాజు తన చారుల ద్వారా దొంగల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజాధనాన్ని దోచుకునే దొంగల్లో రెండు రకాలు. మొదటి రకం ప్రత్యక్ష దోపిడీ చేసేవారు. వీరిని మనువు ‘ప్రకాశ వంచకులు’ అన్నాడు. వీరు పట్టపగలు - అంటే ప్రత్యక్షంగా, బహిరంగంగా - ప్రజలను దోచుకునేవారు. వివిధ వ్యాపారాలు చేస్తూ, ప్రజలకు తూకం తక్కువ సరకులు, కల్తీ సరకులు మొదలైనవి అమ్మేవాళ్ళు. రాత్రి వేళల్లో దొంగతనాలు చేసేవారు, అడవులలో దాక్కుని దారి కాచి, దాడులుచేసి ప్రజలను దోచుకునేవారు ‘ప్రచ్ఛన్న వంచకుల’ కిందికి వస్తారు. అవడానికి దోపిడీ చేసే సమయంలో వీరు కూడా ‘పశ్యతోహరులు’ అంటే ప్రత్యక్ష దోపిడీ చేసేవాళ్ళే అయినా, వీరు సైనికులు, ప్రభుత్వాధికారులకు తాము దొరికిపోతామనే భయంతో అడవులలోనూ, గుహలలోనూ, నిర్జనప్రదేశాలలోనూ చాటుమాటుగా జీవిస్తూ ఉంటారు కనుక మనువు వీరిని ‘ప్రచ్ఛన్న వంచకులు' గానే భావించాడు. ఇక ఈ శ్లోకంలో మిగిలిన పలు తరహాల వంచకులను ప్రస్తావించాడు మనువు.)
శ్లో. ఉత్కోచకా శ్చౌపధికా వంచకాః కితవా స్తథా | 
మంగలాదేశ వృత్తాశ్చ భద్రాశ్చేక్షణికై స్సః || (మనుస్మృతి 9-258)
ఉత్కోచకుడు అంటే లంచగొండి. ఔపధికుడు అంటే జనాన్ని భయపెట్టి వారి దగ్గరున్న సొమ్ము గుంజుకునేవాడు. వంచకుడు అంటే మోసగాడు. కితవుడు అంటే జూదరి, అబద్ధాలకోరు లేక జులాయి. ఇంకా ‘మంగలాదేశ వృత్తాః’ అంటే ‘త్వరలో మీకు మంచే జరుగుతుంది’ అంటూ ప్రజలకు జ్యోతిషం పట్ల భ్రమలు కలిగించి తమ పబ్బం గడుపుకునేవాడు. (‘ఈ శుభ ముహూర్తంలో ఈ ఈ శుభకార్యాలు చేస్తే మీకు మేలు జరుగుతుంది' అని చెపుతూ ప్రజల్ని నమ్మిస్తూ తన్మూలంగా జీవనోపాధి పొందే పురోహితుడు). ‘భద్రాః’ అంటే శుభాశుభ ఘడియల గురించి వివరించే మౌహూర్తికుడు లేక జోస్యుడు. ప్రాచీన కాలంలో మొత్తం 11 రకాల కరణాలలో ‘భద్రా’ అనే ఒక తరహా గ్రామ కరణం ఈ మౌహూర్తిక విధులు నిర్వర్తించేవాడట. ఈక్షణికుడు అంటే అరచేతులలోని గీతలు, ఒంటిమీద పుట్టుమచ్చలు మొదలైనవి చూసి శుభం చెప్పేవాడు అంటే హస్త సాముద్రికుడు - వీరంతా పై మనుస్మృతి శ్లోకం ప్రకారం మోసగాళ్ళ జాబితాలోకే వస్తారు. ఇలాంటి వారినందరినీ సమాజానికి దూరంగా ఉంచాలనీ, వారంతా మోసగాళ్ళు కనుక వారి పట్ల జాగరూకతతో ఉండాలని మనువు హెచ్చరించాడు.
ఇన్ని వందల ఏళ్ళ తరువాత కూడా ప్రజాసామాన్యంలో స్వయం కృషి మీద నమ్మకంలేనివారు, దురాశాపరులు మొదలైనవారు జ్యోతిషము, హస్తసాముద్రికము వంటి అశాస్త్రీయమైన విషయాలమీద గంపెడు ఆశలతో జీవిస్తున్నారు. నిజాయతీతో కూడిన కఠోర శ్రమకు స్వస్తిచెప్పి, కనీస స్వయంకృషికి కూడా తిలోదకాలిచ్చి, ఎటునుంచో, ఎప్పుడో, ఏదో కలిసొస్తుందని ఆశగా ఎదురుతెన్నులు చూసే ఇలాంటి వారి అమాయకత్వం, దురాశలను ఆసరాగా చేసుకుని జోస్యులు, హస్త సాముద్రికులు, మౌహూర్తికులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా జ్యోతిషాన్నీ, హస్త సాముద్రికాన్నీ శాస్త్రాలుగా గుర్తించి, యూనివర్సిటీ స్థాయిలో వాటిని బోధనాంశాలుగా నిర్ణయించి, వాటిలో డిగ్రీలు, పి.హెచ్.డి.లు కూడా ఇస్తూ ఉండడం దారుణం. త్వరలో హస్తలాఘవము, ఇంద్రజాలము కూడా చతుష్షష్టి (64) కళలలో ఉన్నాయి కనుక ప్రభుత్వాలు హస్త లాఘవం (చేతివాటం) చూపే జేబుదొంగలనూ, గారడీవారినీ ప్రోత్సహించే ఉద్దేశంతో హస్తలాఘవ కళనూ, ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార గారడీ విద్యలను కూడా బోధనాంశాలుగా నిర్ణయించి, మనువు పేర్కొన్న మోసగాళ్ళ సేనకు మరింతమందిని జోడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనిపిస్తున్నది.
బహుపరాక్ !! ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం !!!
-- ఇది శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారి అభిప్రాయం ( వారి పేస్ బుక్ పేజీ నుండి సంగ్రహణ )

8, జులై 2017, శనివారం

మూఢ నమ్మకాల నిర్ములన చట్టం - సాధన సదస్సు

మూఢ నమ్మకాల నిరుమూలన  చట్టం  - ఆవశ్యకత  - సాధన  కొరకు గుంటూరులో 25-06-2017 మల్లయ్య లింగం భవన్లో హేతువాదులు , అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు ఒక సదస్సు ఏర్పాటు చేసారు. దీనిలో హేతువాది పి. సుబ్బరాజు గారిచే రూపొందించబడిన మూఢ నమ్మకాల నిర్ములన చట్టం యొక్క ముసాయిదా ప్రతిని ( ఇంతకు ముందే మహారాష్ట్ర లో ఉన్న చట్టం నేపథ్యంలో) ప్రవేశపెట్టి దాని లోతుపాతులను చర్చించారు. ఉదయం జరిగిన సమావేశంలో ఆంద్ర ప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వేంకట సుబ్బయ్య గారు, శాసన మండలి సభ్యులు రామ కృష్ణ  , మాజీ ANU  రిజిస్టార్ ఆర్ . సాంబశివరావు, రచయత ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, మద్దుకూరి అశోక్ గారు ప్రసంగించారు.  సాయంత్రం సభలో వివిధసంఘాల ప్రతినిధులు  ఈదర గోపీచంద్, జంపని కృష్ణ కిషోర్ , హేతువాది సంపాదకులు  ఐ. వి. గారు, ఊట్ల రంగనాయకులు గారు  ప్రసంగించారు.  ప్రజలలో చైతన్యం కలిగించగలిగితే మూఢ నమ్మకాలు వాటంతకవే పోతాయి అని అప్పటి వరకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవని అభిప్రాయపడుతూ ఈ చట్టం గురించి ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించి దానికి చట్ట బద్ధత వచ్చేలా కృషి చేయాలని వక్తలు కోరారు. ఈ సదస్సుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుండి హేతువాదులు హాజరైనారు. 
ప్రసంగిస్తున్న సుబ్బా రాజు , వివిధ సంఘాల ప్రతినిధులు 

 ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్
శాసన మండలి సభ్యులు రామ కృష్ణ

సదస్సుకు హాజరైన హేతువాద మిత్రులు 
  వార్తలు 

31, డిసెంబర్ 2016, శనివారం

స్వాగతం-201717, జులై 2016, ఆదివారం

జల జాతర - 2016

తెలుగునాట కృష్ణా నది పుష్కరాల పేరుతో మరొక జల జాతర - 2016 ఆగస్టు 12 న మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) పాటించేవారికి అది ఒక మాసం. 12 మాసాలు కు 12 ఏళ్ళు పట్టి ఒక కొత్త సంవత్సరం మెదలు అవుతుంది. దీనిని బట్టి మనకు 12 సంవత్సరాలు కాలం దేవతలకు ఒక దినం అనే ఒక దేవతా కాలమానం పుట్టించారు. 
దాని ప్రకారం బృహస్పతి గ్రహం సింహ రాశి లో ఉంటే గోదావరికి , కన్య రాశి లో ఉంటే కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా 12 రాశులకు 12 నదులకు పుష్కరాలు ఏర్పరిచారు. దేశంలో ఇంకా చాలా నదులు, పురాణాల ప్రకారం మూడున్నర కోట్ల పుణ్య తీర్థాలు ఉన్నా కేవలం పురోహిత ప్రాభల్యం ఉన్న నదీతీర పట్టణాలను బట్టి, ప్రవాహం ఉండే గురుమాసంను బట్టి ఈ 12 జీవ నదులను ఎంపిక చేశారు. నదుల నైసర్గిక స్వరూప స్వభావాలు తెలియని కుక్షింభరులు ప్రాంతాల కూర్పుతో ఏర్పరిచిన ఈ పుష్కరాల పండుగలో ఉపనదులకు కూడా చోటు దక్కింది. తుంగ,భద్ర, భీమా నదులు కృష్ణా నదిలో ప్రాణహిత నది గోదావరిలో సంగమిస్తుందన్న జ్ఞానం లేని పండితులు గురు గ్రహం వృచ్ఛకంలో ఉంటే భీమా నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రకు, మీనరాశిలోఉంటే ప్రాణహితకు పుష్కరాలు వస్తాయని చెప్పారు. దీని ప్రకారం 2018 లో భీమానది వల్ల, 2020 లో తుంగభద్ర వల్ల కూడా కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే 2022లో ప్రాణహిత వల్ల మరోసారి గోదావరికి పుష్కరాలు పునరావుతమౌతాయి కదా! అలాగే గోదావరి పట్టిసీమ ద్వారా కృష్ణాలో కలుస్తుంది కాబట్టి గోదావరికి సంబంధం ఉన్న పుష్కరాలు కృష్ణకు వర్తిస్తాయి. అంటే పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయనేది వాస్తవం కాదు. అలాగే ఏ నదులకు పుష్కరయోగం ఉందొ, దేనికి లేదో అనే విషయంలో కూడా జ్యోతిష్య పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పుష్కర వ్యాపారం పరాకాష్టకు చేరి పిండం పెట్టె పురోహితుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు విజయవాడ వద్ద కృష్ణాలో కలుస్తాయి కాబట్టి విజయవాడ లో జరిగే పుష్కర స్నానంలో పుణ్యం రాదని విజయవాడ ఎగువన తెలంగాణలో చేస్తేనే పుణ్యం వస్తుందనేది అక్కడి పండితుల వాదన అయితే ఇది దక్షిణలు దండుకునేందుకు పొట్టకూటి పురోహితుల పన్నాగం అని ఇక్కడ వారి ఉవాచ. 
నదుల అనుసంధానం వల్ల ప్రతి ఏడాది పుష్కరం వచ్చే చిక్కు ఉంది కాబట్టి అనుసంధానమే అపవిత్రమనే కుక్షింభరులను ఉపేక్షించితే దేశానికి నీటి ఎద్దడి, ఆహార కొరత వచ్చే ప్రమాదముంది. గోదావరి, కృష్ణ నదులతో పాటు వాటి ఉప నదులకు కూడా పుష్కరాలు ఉన్నాయన్న సంగతి ఈ బాపతు పొట్టకూటి వాదనలు చేసేవాళ్ళు గుర్తుంచుకుంటే మంచిది. 
మతపరమైన ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఒక పద్దతి ప్రకారం పుష్కరాల పేరుతో అన్ని ప్రాంతాల ప్రజలను పిండుకొనే వైనం గోచరిస్తుంది. అమాయాక ప్రజలను మభ్యపెట్టటానికి పుష్కరాలను గురించి ఒక కాకమ్మ కధ చెబుతారు. 
పూర్వం తుందిలుడనే బ్రాహ్మణుడు ఈశ్వరుని గురించి తపమాచరించి తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం ఉండేలా వరాన్ని పొందాడట. జలమూర్తి రూపంలో అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే జల శక్తి (సంస్కృతంలో పుష్కరం అంటే తామర కొలను, సరస్సు అనే అర్థాలతోపాటు, పోషించే శక్తిని కూడా పుష్కరం అని అంటారు) లభించటం వల్ల తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వమనగా, ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత (?) ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాగా ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మని వదలి వెళ్ళలేనని తెగేసి చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక త్రిసభ్య ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో కలిసి ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ కధనంలో కనిపించే పరస్పర వైరుధ్యాలు, విచిత్రకల్పన వల్ల కధలో ఉన్న డొల్లతనం ప్రస్ఫుటం అవుతున్నది. 
పుష్కర స్నానం వల్ల పుణ్యం, పుష్కర దానం, పుష్కర పిండం వంటి వాటివల్ల చనిపోయిన పితృ దేవతలకు పుణ్యలోకం ప్రాప్తిస్తుందనే విశ్వాసం మాటున సామూహిక దోపిడీ దాగుందన్నది దాచలేని నిజం.
పుష్కర స్నానం పుణ్య ప్రదం అనే పురాణాల ప్రవచనాలు నమ్మి పిల్ల జెల్లా లతోపాటు స్త్రీ పురుషులు అందరు పుష్కరాలకు పరుగులు తీస్తారు. నదీ స్నానం వల్ల పుణ్యం మాట దేవుడెరుగు, అపరిశుభ్ర నీటి వల్ల జల సంబంధ జబ్బులు రావటం ఖాయం. 
అలాగే మరణించిన పితురులకు ప్రతి ఏడాది సంవత్సరీకం చేసే ఆచారం జంధ్యం వేసుకొనే కొన్ని కులాలలో (ద్విజులు) కొందరికి మాత్రమే ఉంది. పుష్కరాల ఆసరాతో 'పిండ ప్రధానం' ఆచారాన్ని అందరికి వర్తింప చేసారు. పిండ ప్రధానం పేరుతో పెట్టే పిడికెడు పిండి, గుక్కెడు నీళ్ళు కాలం చెందిన పితృ దేవతల ఆకలి తీరుస్తుదనేది వట్టి బూటకమాట. పున్నామనరకం నుండి బయటపడేందుకు చేసే పుష్కర దానాలు చేరేది పురోహితుల ఇళ్లకే కానీ పుణ్యలోకాలకు కాదు. బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు సరిగ్గా తిండి పెట్టని ప్రభుద్దులు మరణించిన వారికి దినాలు, తద్దినాలు పేరుతో పిండాలు పెట్టటం, దానాలు చేయటం అనుచితం, అవాంఛనీయం. 
రోజువారీ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేలా పుష్కర స్నానాల పేరుతో ఒక బృహత్తర పజాపయోగ్య పనిగా నేటి పాలకులు పుష్కర నిర్వహణను నెత్తిన పెట్టుకున్నారు. సాముకంగా జనులను మూఢ విశ్వాసాలలో ముంచే ఇలాంటి పనికి ప్రపంచవ్యాప్త ప్రచారం చేయటం ఆక్షేపణీయం. పుష్కారాలకు వచ్చే యాత్రికుల బాగోగులు చూడాలన్న మిషతో తాత్కాలిక ఏర్పాట్లకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టె కోట్లాది రూపాయలు లెక్కా డొక్కా ఉండదు. ప్రజా ధనాన్ని ఇలా నీటి పాలు చేయటం సరికాదు. 
ప్రజలలో శాస్త్రీయ భావనలు పెంచి వారిని వివేకవంతులగా చేయటానికి బదులు ఆదిమ కాలం నాటి మత విశ్వాసాలను పెంచి పోషించటం దేశానికి, సమాజానికి ఎంతమాత్రం శ్రేయోదాయకం కాదు.

5, జులై 2016, మంగళవారం

దేవుళ్ళ కబ్జాలో రహదారులు !!!


వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లోప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్మించే ప్రార్ధనా మందిరాలకు, విగ్రహాలకు అనుమతి ఇవ్వరాదని అన్ని ప్రభుత్వాలకు ఇంతకు ముందే సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వటం దేశానికి శుభోదయం. దానిని పెడచెవిని పెట్టటం దివాలాకోరు రాజకీయం. 


దేవుని పేరుతొ సంఘానికి / సమాజానికి అసౌకర్యాన్ని ఆటంకాలను కల్పించే ఈ ప్రార్ధనా మందిరాలను, నేతల విగ్రహాలను రోడ్లపై ప్రతి చోట మనం గమనించుతున్నదే.

రహదారులు రాక పోకలకు మాత్రమే నన్న జ్ఞానం కొరవడి, పంతాలు పట్టింపులకు పోయి మనకు మనమే కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. 

వాస్తు శాస్త్రం లో దేవాలయాలు నిర్మిం చటానికి అనువైన ప్రదేశాల గురించి కొన్ని మార్గ దర్శకాలు వున్నాయి. ప్రశాంత ప్రదేశాలలో, అసౌకర్యం కలుగకుండా వీటిని నిర్మించుకోవాలి. దేవాలయ వాస్తు ప్రకారం వీధుల్లో అడ్డంగా గుడులు/ఆలయాలు కట్టరాదు. గుడి చుట్టూ ప్రదక్షిణాలకు తగినంత ఖాళీ ప్రదేశం వదలి తీరాలి. అపరిశుభ్ర ప్రదేశాలలో, జనావాసాల మధ్య వీటిని నిర్మించరాదు. ఈ జ్ఞానం వీధుల్లో గుడి కట్టే వారికి కాని, దాన్ని బలపరిచే/ప్రోత్సహించే వారికి కాని లేక పోవటం ఈ దేశ దౌర్భాగ్యం. 

మతానికి ఊతం మందిరం అనే సాధు పుంగవులు, స్వయంభువ స్వామీజీలు, రాజకీయ సన్యాసులు స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వీధి రాజకీయాలలో   తలదూర్చటం నైతిక దిగజారుడు తనం . ఒక మతం వారిని చూచి వేరొక మతం వారు ఇలా వీలునుబట్టి వీధులను ఆక్రమించుకోవటం, ఆక్రమణలతో రోడ్లపై పెత్తనం చేయటం ఈ నాడు నిత్య కృత్యంగా మారింది. దేవుణ్ణి అడ్డం పెట్టి రోడ్డుపై వ్యాపారం చేసే ఈ అవాంచనీయ పోకడలకు అడ్డు కట్ట వేసే దిశగా పాలకులు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి.   


వీధికి అడ్డంగా రాకపోకలకు అసోకర్యంగా రోడ్డ్లపై బొగ్గుతో దేవుని బొమ్మ వేసి, వాటికి రంగులు పూసి సాయంత్రానికి వాటిపై పడ్డ చిల్లర డబ్బులు ఏరుకునే ధూళి చిత్రకారులే ఈ బాపతు జనం కంటే నయం. కళాత్మకంగా ఉదయం గీసిన దేవుళ్ళ బొమ్మలు సాయంత్రానికి తుడిపెస్తారు.


ఇప్పటికే రోడ్లకు అడ్డంగా శాస్వితంగా ఉండేలా నిర్మించిన మత మందిరాలను విశ్వాసుల మనో భావాలకు భంగం కలుగుతుందన్న సాకుతో వాటి జోలికి వెళ్లకపోవటం కూడా న్యాయ ధిక్కారం  క్రిందికే వస్తుంది. వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఇలాంటి విషయాలలో ఉపేక్షించితే కొన్నాళ్ళకు నడవటానికి దారులే మిగలవు. 

ప్రజాస్వామ్యంలోవ్యక్తి స్వేచ్చకు భంగం చేయటం, మతం పేరుతొ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించటం, హింసించటం శిక్షార్హం. వ్యక్తిగత మత విశ్వాసాలను అందరిపై రుద్దటం, తమ స్వార్ధం కొరకు మతాన్ని పావుగా వాడుకోవటం ఈ నాడు చాలా మామూలు విషయంగా తయారైయింది. ఈ పెడదోరణి మారాలి. 

గుడి,మసీదు,దర్గా,చర్చి అది ఏదైనా, దాని వెనుకున్న మతమేదైనా కానివ్వండి... వీధి/దారికి ఆటంకం కలిగించే అన్ని ప్రార్ధనా మందిరాలను తొలగించటానికి ప్రతి మతం వారు సహృదయంతో సహకరించాలి. అలాగే చికాకు కలిగేలా రోడ్ల కూడలిలో, మధ్యలో విచ్చలవిడిగా ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించాలి. 

సిద్ధాంత రాద్ధాంతాల  ముసుగులో మందిరాలకు మద్దతుగా మత, కుల, వర్గ, ప్రాంత ద్వేషాలు రాజేసే రాజకీయ నిరుద్యోగులు పన్నే ఉచ్చులో పడకుండా హేతుబద్దంగా ఆలోచించాలి. 
సమాజ పునర్నిమాణమంలో హేతుబద్ధ ఆలోచనలతో అందరూ సహకరించాలి.