Suryadevara Sanjivadev poet, philospher, art critic, landscapist, photographer and the one who knows the art of life. పోస్టుకార్డు ముఖం తెలియని తరానికి అందమైన రంగుల అక్షరాల్లో మెరిసే సంజీవదేవ్‌ని పరిచయం చేయడం కష్టమే. ఏడాదిలో ఒక్కసారి కూడా సూర్యోదయం ఎరుగని వారికి ఆ ప్రాకృతిక మానవుడి వివరాలు తెలియడం సాధ్యం కాదు. పల్లెలంటే పేడకుప్పలు, మట్టిరోడ్లు మాత్రమే తలపునకు వచ్చే మనుషులకు తెనాలి దగ్గరి తుమ్మపూడి గ్రామాన్ని ప్రపంచానికి లోగిలిగా మార్చిన మహత్తర సృజనకారుణ్ణి, కళాకారుణ్ణి స్నేహమయుణ్ణి గురించి వట్టినే చెప్పడం కుదిరే పని కాదు. సూర్యదేవర సంజీవదేవ్ శతజయంతిని పురస్కరించుకుని ప్రచురించిన 'సంజీవదేవ్ జీవనరాగం'... అటువంటి వారికి ఆయనను రేఖల్లోనూ, పలుకుల్లోనూ పరిచయం చేసే ప్రయత్నం చేసింది. సంజీవదేవ్ స్వీయచరిత్ర, లేఖలు, జ్ఞాపకాల ఆధారంగా రావెల సాంబశివరావు చేసిన ఈ రచన మూలాన్ని మరింత సులభగ్రాహ్యం చేసిందే తప్ప జీవనతత్వాన్ని కషాయంగా మార్చలేదు. లోక సంచారిగా మొదలైన సంజీవదేవ్ జీవితం హిమనదాల లోతులను చూస్తూ బెంగాలీల రాత, గీతలను చూస్తూ 18వ ఏట తుమ్మపూడి చేరేనాటికి జీవన కళాతత్వాన...