నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు. ఇప్పుడున్న సీతరాముల గుడి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే. భద్రాచలం రామాలయం అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే నిర్మించబడిన సీతారాముల దేవాలయం చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు. ఇది 1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...