నార్ల వెంకటేశ్వరరావు (1908 - 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు.రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ' బు...