విగ్రహారాదన ను తీవ్రంగా నిరసించిన మీకు మేము హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మీ విగ్రహాన్ని పెట్టి తప్పు చేసాం.విశ్వమానవాళికి హేతు బుద్దిని ప్రసాదించిన మీకు మత, కుల, ప్రాంతపు రంగు పులిమిన ఈ 'ధూర్త మానవలకు' దశ,దిశా నిర్దేశం కలిగేలా, ప్రజలలో అజ్ఞానం,అంధ విశ్వాసాలు తొలగి వివేకం పెరిగేలా, మత పిచ్చి, కుల పిచ్చి రూపు మాపెలా మన తెలుగు జాతికి జ్ఞానాన్ని కలుగజేయి. ఈ ధూర్త మానవులను క్షమించు.వారికి హేతు బుద్దిని కలిగించు. ![]() |
| త్రిపురనేని రామస్వామి |
కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.1898 లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు.
1914 లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీ బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ కృష్ణా పత్రిక లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే 'వీరగంధం తెచ్చినారం వీరుడు ఎవ్వడో తెల్పుడీ' వంటి అనేక దేశభక్తి గీతాలు రచించాడు.
1917 లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే.
స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన 'కుల వ్యవస్థ' మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డాడు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు. 'సూతాశ్రమం' అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన 'వివాహ విధి' అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించాడు.ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు.. మానవసేవే మాధవసేవ అని నమ్మాడు.
-
- మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
- విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
- త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
- పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.
మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతోన్మాదులను ఈసడిస్తూ ....
-
- ఒకరు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
- కొకరు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
- రొంకరు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.
ఈయన చేసిన ముఖ్య రచనలు -
- సూతపురాణము
- కొండవీటి పతనము
- కుప్పుస్వామి శతకం
- మాల దాసరి
- గోపాలరాయ శతకం
- పల్నాటి పౌరుషం
- శంబూకవధ
- సూతాశ్రమ గీతాలు
- ధూర్త మావన శతకము
- ఖూనీ
- భగవద్గీత
- రాణా ప్రతాప్

Comments
gks raja
కేవలం విగ్రహాల ధ్వంసాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మాట్లాడడం హేతువాదం అనిపించుకోదు. ఈ రోజు త్రిపురనేని రామస్వామిగారో, శ్రీశ్రీ గారో బ్రతికివుంటే పరిస్థితిని తప్పక అర్థం చేసుకుని ఉండే వారు.
విగ్రహాల ధ్వంసం ద్వారా ప్రభుత్వాల చేతగాని తనం పైన, రాజకీయుల కప్పదాటు విధానాల పైన నిరసన తెలిపారు.
ఒక ప్రాంతపు ప్రజలంతా 'మీతో కలిసి ఉండడం మాకు సాధ్యం కాదు బాబో' అంటుంటే, 'వీల్లేదు, మీరు మాతో కలిసి ఉండాల్సిందే' అని చేసే నిర్హేతుక వాదనలపై, కపటపు ఉద్యమాలపై నిరసన తెలిపారు.
ప్రజాస్వామ్య బద్ధంగా చేయదలుచుకున్న ర్యాలీని లక్ష అరెస్టులతో అడ్డుకోవాలనుకున్న ప్రభుత్వ అహంకారం పై నిరసన తెలిపారు.
మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.
ఆయన ఎంత బాగా చెప్పారు!
జరుగుతున్న దేమిటి? ఒకరు flourine తో కునారిల్లుతుంటే, ఇంకొకరు పొలాలు బీడు పెట్టి పొట్ట చేత బట్టుకుని కూలీ పనికోసమై దేశ ద్రిమ్మరుల్లాగా తిరుగు తుంటే, పక్కనే జీవనది పారుతున్నా వారికి నీరు దొరకదు. ఇంకొకరికి మూడోకారు స్థిరీకరణకు జోరుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి, న్యాయపరంగా నీటిలో వాటా లేకున్నా సరే.
ఈ సంఘటనలో దోషులెవరైనా వుంటే, అది త్రిపురనేని విగ్రహాన్ని మాత్రమే పెట్టి, ఆయన ఆలోచనా విధానాన్ని అందుకోలేక పోయిన ప్రభుత్వానిది, వ్యవస్థది.