తెలంగాణా వస్తుందా? రాదా? దీనిపై గ్రహాలూ ఏమంటున్నాయి? అనేదానిపై నిన్న ఒక టి.వి. చానల్ లో దైవజ్ఞుల (?) మద్య చర్చా కార్యక్రమం జరిగింది. దీనిలో సారాంశం ఏమిటంటే ... తెలంగాణాకు గ్రహాలూ అనుకూలంగా లేవు కాబట్టి రాదనీ ఒక జ్యోతిష్కుడు, అనుకూలంగా గ్రహాలూ ఉన్నాయని మరొక జ్యోతిష్కుడు వాదించుకొని ఎంచక్కా లేచిపోయారు. పుట్టే బిడ్డ ఆడా, మగా అని అడిగితే ... ఒకడు మగ అని మరొకడు ఆడ అని వాదించు కున్నట్లు ఉంది వీరి వాదనలు. ఇలాంటి చర్చలలో ఎవరు చెప్పింది జరిగిందో అది వారి గొప్ప గాను, జరగక పోతే... అది జ్యోతిష్కుని అసమర్ధత గాను లెక్కించటం షరా మామూలే. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా దీనిలో జ్యోతిష్యానికి మాత్రం (జ్యోతిష్య శాస్త్రం ) ఓడిపోదు. శాస్త్రాన్ని తప్పు పట్టటం జరగనే జరగదు. ఇది ఈ శాస్త్రం యొక్క మార్మిక బలం.
జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

Comments