22, ఆగస్టు 2017, మంగళవారం

జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలే !

మనువు దృష్టిలో
జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలే !
స్మృతికారుడు మనువు దృష్టిలో జ్యోతిషము, హస్తసాముద్రికము పచ్చి మోసాలనే విషయం మీద ఆధార సహితంగా శ్రీ ముతేవి రవీంద్రనాథ్ గారు  రాసిన ఈ వ్యాసం  పేస్ బుక్ లో చూడనివారికోసం తిరిగి ఇలా ..
జ్యోతిషము, హస్త సాముద్రికము పచ్చి మోసాలు. ఈ మాట ఎవరో శాస్త్రీయ దృష్టి కలిగిన ఆధునికుడు అన్నది కాదు. వందల ఏళ్ళ క్రిందటే ప్రసిద్ధ భారతీయ స్మృతి కారుడు మనువు పేర్కొన్నది. తాను రాసిన ‘మను ధర్మ శాస్త్రం' ద్వారా వర్ణాశ్రమ ధర్మాలను వ్యవస్థీకృతం చేసి, సామాజికంగా కర్కశమైన కుల నియమాలను, కఠినమైన కట్టుబాట్లను ఏర్పరచి సమాజాన్ని నిమ్నోన్నత సామాజిక వర్గాలుగా ముక్క చెక్కలు చేశాడన్న దుష్కీర్తిని మూటగట్టుకున్న మనువు తాను రూపొందించిన ‘మనుస్మృతి' లోని నవమాధ్యాయంలోని 258 వ శ్లోకంలో ఏమన్నాడో చూడండి -
( నేపథ్యం : రాజు తన రాజ్యంలోని ప్రజల సంక్షేమం దృష్ట్యా ఎవరెవరి పట్ల జాగరూకత కలిగి ఉండాలో చెపుతాడు మనువు. రాజు తన చారుల ద్వారా దొంగల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజాధనాన్ని దోచుకునే దొంగల్లో రెండు రకాలు. మొదటి రకం ప్రత్యక్ష దోపిడీ చేసేవారు. వీరిని మనువు ‘ప్రకాశ వంచకులు’ అన్నాడు. వీరు పట్టపగలు - అంటే ప్రత్యక్షంగా, బహిరంగంగా - ప్రజలను దోచుకునేవారు. వివిధ వ్యాపారాలు చేస్తూ, ప్రజలకు తూకం తక్కువ సరకులు, కల్తీ సరకులు మొదలైనవి అమ్మేవాళ్ళు. రాత్రి వేళల్లో దొంగతనాలు చేసేవారు, అడవులలో దాక్కుని దారి కాచి, దాడులుచేసి ప్రజలను దోచుకునేవారు ‘ప్రచ్ఛన్న వంచకుల’ కిందికి వస్తారు. అవడానికి దోపిడీ చేసే సమయంలో వీరు కూడా ‘పశ్యతోహరులు’ అంటే ప్రత్యక్ష దోపిడీ చేసేవాళ్ళే అయినా, వీరు సైనికులు, ప్రభుత్వాధికారులకు తాము దొరికిపోతామనే భయంతో అడవులలోనూ, గుహలలోనూ, నిర్జనప్రదేశాలలోనూ చాటుమాటుగా జీవిస్తూ ఉంటారు కనుక మనువు వీరిని ‘ప్రచ్ఛన్న వంచకులు' గానే భావించాడు. ఇక ఈ శ్లోకంలో మిగిలిన పలు తరహాల వంచకులను ప్రస్తావించాడు మనువు.)
శ్లో. ఉత్కోచకా శ్చౌపధికా వంచకాః కితవా స్తథా | 
మంగలాదేశ వృత్తాశ్చ భద్రాశ్చేక్షణికై స్సః || (మనుస్మృతి 9-258)
ఉత్కోచకుడు అంటే లంచగొండి. ఔపధికుడు అంటే జనాన్ని భయపెట్టి వారి దగ్గరున్న సొమ్ము గుంజుకునేవాడు. వంచకుడు అంటే మోసగాడు. కితవుడు అంటే జూదరి, అబద్ధాలకోరు లేక జులాయి. ఇంకా ‘మంగలాదేశ వృత్తాః’ అంటే ‘త్వరలో మీకు మంచే జరుగుతుంది’ అంటూ ప్రజలకు జ్యోతిషం పట్ల భ్రమలు కలిగించి తమ పబ్బం గడుపుకునేవాడు. (‘ఈ శుభ ముహూర్తంలో ఈ ఈ శుభకార్యాలు చేస్తే మీకు మేలు జరుగుతుంది' అని చెపుతూ ప్రజల్ని నమ్మిస్తూ తన్మూలంగా జీవనోపాధి పొందే పురోహితుడు). ‘భద్రాః’ అంటే శుభాశుభ ఘడియల గురించి వివరించే మౌహూర్తికుడు లేక జోస్యుడు. ప్రాచీన కాలంలో మొత్తం 11 రకాల కరణాలలో ‘భద్రా’ అనే ఒక తరహా గ్రామ కరణం ఈ మౌహూర్తిక విధులు నిర్వర్తించేవాడట. ఈక్షణికుడు అంటే అరచేతులలోని గీతలు, ఒంటిమీద పుట్టుమచ్చలు మొదలైనవి చూసి శుభం చెప్పేవాడు అంటే హస్త సాముద్రికుడు - వీరంతా పై మనుస్మృతి శ్లోకం ప్రకారం మోసగాళ్ళ జాబితాలోకే వస్తారు. ఇలాంటి వారినందరినీ సమాజానికి దూరంగా ఉంచాలనీ, వారంతా మోసగాళ్ళు కనుక వారి పట్ల జాగరూకతతో ఉండాలని మనువు హెచ్చరించాడు.
ఇన్ని వందల ఏళ్ళ తరువాత కూడా ప్రజాసామాన్యంలో స్వయం కృషి మీద నమ్మకంలేనివారు, దురాశాపరులు మొదలైనవారు జ్యోతిషము, హస్తసాముద్రికము వంటి అశాస్త్రీయమైన విషయాలమీద గంపెడు ఆశలతో జీవిస్తున్నారు. నిజాయతీతో కూడిన కఠోర శ్రమకు స్వస్తిచెప్పి, కనీస స్వయంకృషికి కూడా తిలోదకాలిచ్చి, ఎటునుంచో, ఎప్పుడో, ఏదో కలిసొస్తుందని ఆశగా ఎదురుతెన్నులు చూసే ఇలాంటి వారి అమాయకత్వం, దురాశలను ఆసరాగా చేసుకుని జోస్యులు, హస్త సాముద్రికులు, మౌహూర్తికులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా జ్యోతిషాన్నీ, హస్త సాముద్రికాన్నీ శాస్త్రాలుగా గుర్తించి, యూనివర్సిటీ స్థాయిలో వాటిని బోధనాంశాలుగా నిర్ణయించి, వాటిలో డిగ్రీలు, పి.హెచ్.డి.లు కూడా ఇస్తూ ఉండడం దారుణం. త్వరలో హస్తలాఘవము, ఇంద్రజాలము కూడా చతుష్షష్టి (64) కళలలో ఉన్నాయి కనుక ప్రభుత్వాలు హస్త లాఘవం (చేతివాటం) చూపే జేబుదొంగలనూ, గారడీవారినీ ప్రోత్సహించే ఉద్దేశంతో హస్తలాఘవ కళనూ, ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార గారడీ విద్యలను కూడా బోధనాంశాలుగా నిర్ణయించి, మనువు పేర్కొన్న మోసగాళ్ళ సేనకు మరింతమందిని జోడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనిపిస్తున్నది.
బహుపరాక్ !! ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం !!!
-- మీ… రవీంద్రనాథ్.